*OFFICE OF THE MINISTER FOR FOREST, ENVIRONMENT AND ENDOWMENTS, TELANGANA GOVERNMENT*
కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి
*ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం*
*సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి*
*శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ గారు*
జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, అమూల్యమైన ఈ జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం మనకు అందిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అన్నారు. శ్రీకృష్ణాష్టమి (ఆగస్టు 26) ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణుడు తన జీవితంలోని పలు దశల్లో ప్రదర్శించిన లీలలు, మహిమలు భక్తులను పరవశింపచేస్తాయని మంత్రి సురేఖ అన్నారు. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుని మహోన్నత వ్యక్తిత్వం, జీవన విధానం నేటి కలియుగంలోనూ మనకు గొప్ప ప్రేరణనిస్తాయని మంత్రి తెలిపారు. శ్రీకృష్ణుడు ప్రవచించిన గీత కేవలం ఆధ్యాత్మిక బోధనలకు మాత్రమే పరిమితం కాదనీ, అదొక విజ్ఞాన భాండాగారమని మంత్రి సురేఖ పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగడానికి కావాల్సిన ప్రేరణను గీత అందిస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే శ్రీకృష్ణుని సందేశమే నేటి పాలక వ్యవస్థలకు మార్గనిర్దేశనం చేసిందని అన్నారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉట్ల పండుగ జీవితాన్ని ఆటపాటలతో ఆనందమయం చేసుకోవాలని తెలియచెప్తుందని మంత్రి తెలిపారు. సమస్యల వలయంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణుని తాత్వికత సరైన దారిని చూపుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు…