నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యాసంస్థల భవనాలు

పోలీసులకు ఏఈఈ ఫిర్యాదు.. కేసు నమోదు

వెంకటాపూర్ గ్రామం నాదం చెరువు సమీపంలో పలా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థల భవనాలు

రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం
పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు(ఏఈఈ) ఎ.పరమేశ్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు బఫర్ జోన్ ను ఈ నెల 22న పరిశీలించగా.. రెండు విద్యాసంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించినట్లు తెలిపారు. నీటిపారుదల చట్టం 1357ఎఫ్ యు/ఎస్ పార్ట్-8 సెక్షన్ 49.1(ఎ), సెక్షన్ 50.1(ఎ), సరస్సులు, కొలనులు, చెరువుల
పరిరక్షణ చట్టం వాల్టాను అనుసరించి నీటి వనరులు, అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వాటి రూపురేఖలను మార్చవద్దని నిబంధనలు చెబుతున్నాయని ఏఈఈ వివరించారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఎఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఈఈ పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ మండలం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.రాజు శుక్రవారం 390/2024, వీ/ఎస్ 329(3), 324(4), 279 2, 3, 4 పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా సబ్ ఇన్స్పెక్టర్ ఎం. శివకృష్ణ ను నియమించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

17 ఎకరాల్లో బఫర్ జోన్

ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని 813 సర్వే నంబరులో నాదం చెరువు ఉంది. ఇది 61 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు ఆయకట్టుకు సాగునీరు అందించిన ఈ చెరువు కింద కాలక్రమంలో భవన నిర్మాణాలు వెలిశాయి. చెరువు వెంబడి 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో దాదాపు రెండున్నర నుంచి మూడున్నర ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

అన్ని అనుమతులు ఉన్నాయి: పల్లా

అనురాగ్ సంస్థలు, గాయత్రి ట్రస్ట్ లో నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ నెల 22న నీటిపారుదల శాఖ ఇంజినీరు మా యూనివర్సిటీకి వచ్చి పరిశీలించారు. మా సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతున్నట్లు 23న ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మమ్మల్ని కనీసం అడగకుండానే పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. గత 25 ఏళ్లలో ఏనాడూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టలేదు. నాదం చెరువు ఎన్టీఎల్, బఫర్ జోన్లలో భవనాలు లేవని నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్త పరిశీలన చేసి.. నిరభ్యంతర పత్రం ఇచ్చాయి. చట్టానికి లోబడే అన్ని అనుమతులు తెచ్చుకున్నాను. ప్రభుత్వం నాపై వ్యక్తిగతంగా జనగామ, హైదరాబాద్లలో కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఒత్తిడి తెచ్చినా.. అక్రమ కేసులు పెట్టినా చట్టప్రకారం నడుచుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.